Mana Telangana: Good News telangana govt ready to release the job notifications by june 2


ఎప్పుడెప్పుగా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్తే. తెలంగాణ సర్కార్ త్వరలోనే ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు అన్న నేపథ్యంలో రకరకాల కారణాల వల్ల తెలంగాణ సర్కార్ ఉద్యోగాల ప్రకటనకు నోటిఫికేషన్ లు జారీ చెయ్యలేదు. ఇప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నోటిఫికేషన్ ల జారీకి సిద్దమవుతోంది. రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖలో పదవీ విరమణ చేసిన వారితోపాటు ఖాళీలు కలుపుకుని.. భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్న 1300 ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పోస్టులకు అనుమతి ఇచ్చేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌కి అవసరమైన 418 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 125 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.


మరోవైపు వీటిలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వివరాలను ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు 25 శాఖల ఉద్యోగాల విభజన విషయంలో స్పష్టత వచ్చిన నేపథ్యంలో సదరు శాఖలు సైతం క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ఉద్యోగులు, ఖాళీల వివరాలు తేల్చే పనిలో పడ్డాయి. ఈ ప్రక్రియ పూర్తయితే ఆ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయా శాఖల అధిపతుల నుంచి వెంటనే ఆర్థికశాఖకు ప్రతిపాదనలు వెళ్లనున్నాయి. ఆర్థికశాఖ అనుమతి పొందడమే ఆలస్యం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆయా విభాగాలు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి. మొత్తంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగాల భర్తీకి ఒకటి లేదా రెండు నోటిఫికేషన్లు విడుదల చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2నుంచి రాష్ట్రంలో జాబుల జాతర కొనసాగనుందని తెలుస్తున్నది.

*మన తెలంగాణా | ఎజుకేషన్,ఫిల్మ్స్,న్యూస్*

Comments