Spy pigeon from Pakistan jailed in Pathankot


పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ సరిహద్దు గ్రామంలో పోలీసులు గురువారం ఓ పావురాన్ని గుర్తించారు. ఆ పావురం రెక్కలపై ఏదో సమాచారం రాసివున్నట్లు పోలీసులు గుర్తించి, ఆ పావురాన్ని పట్టుకున్నారు. జమ్మూ, పఠాన్‌కోట్ ప్రాంతంలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు సంచరించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిన రెండు రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళితే.. పఠాన్‌కోట్ జిల్లాలోని మన్వాల్ గ్రామస్తుడు రమేష్ చంద్.. తన ఇంటిమీదుగా వెళుతోన్న ఓ పావురాన్ని పట్టుకున్నాడు. పరీక్షించి చూడగా, దాని రెక్కలపై ఏవేవో అక్షరాలు రాసివున్నాయి. దీంతో అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పావురాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని రెక్కలపై ‘తహశీల్ షకార్‌గంజ్, జిల్లా నరోవాల్' అని ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో రాసి వుండటాన్ని గుర్తించారు. ఆ తర్వాత సదరు పావురానికి ఎక్క్‌రే పరీక్షలు కూడా నిర్వహించారు. కాగా, పావురం పాకిస్థాన్ నుంచే వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అయితే అనుమానిత పదార్థాలేవీ బయటపడనప్పటికీ పావురం రెక్కలపై ఉన్న రాతలు ఏదైనా రహస్య సమాచారానికి సంబంధించినవా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పఠాన్‌కోట్ ఎస్పీ రాకేశ్ కౌషల్ తెలిపారు. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీస్ ఏజెన్సీలతోపాటు బార్డర్ సెక్యూరిటీస్ ఫోర్స్‌కు సమాచారం అందించి అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మూడు నెలల కిందట గుజరాత్‌లోని ద్వారకా జిల్లాలోనూ ఇలాంటిదే ఓ పావురం భద్రతా బలగాలకు చిక్కింది. దాని నుంచి ‘బెంజింగ్ దువాల్' అని రాసివున్న ఒక ఎలక్ట్రానిక్ చిప్, ‘28733' నవంబర్ ముద్రించిన ఓ ఉంగరం, రెక్కల మధ్యలో ‘రసూల్ ఉల్ అల్లాహ్' అని అరబిక్ భాషలో రాసివున్న సందేశాన్ని గుర్తించారు.

Comments