People coments on secton 8 in Telangana



హైదరాబాద్ పగ్గాలు గవర్నర్‌కు ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని, హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ అని, తెలంగాణ ఉనికిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ వాదనకు తెరతీస్తున్నారని సోషల్‌మీడియా ‘తెలుగు పల్స్’ నిర్వహించిన సర్వేలో అత్యధికంగా 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలంటూ తెలుగుదేశం కేవలం ఓటుకు నోటు కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే డిమాండ్ చేస్తోందని 81 శాతం మంది పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8పై వివాదం చెలరేగిన నేపథ్యంలో ‘తెలుగు పల్స్’ సోషల్ మీడియా నెటిజనుల నుంచి రెండు సంబంధిత అంశాలపై సర్వే నిర్వహించింది. ఇందులో                  
 మొదటి ప్రశ్న: హైదరాబాద్ పగ్గాలు గవర్నర్‌కు ఇవ్వడం సమంజసమేనా? 
 రెండవ ప్రశ్న: హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలంటూ తెలుగుదేశం ఎందుకు డిమాండ్ చేస్తోంది?
పారదర్శకంగా, సశాస్త్రీయంగా సర్వేను నిర్వహించారు. తెలుగు పల్స్ నిర్వహించిన సర్వేల ప్రక్రియలో ఇది మూడో సర్వే. వివిధ సమాచార సాధనాల ద్వారా ఈ రెండు ప్రశ్నలను 1,46,624 మందికి చేరవేశారు. సర్వేలో 9152 మంది స్పందించారు.



హైదరాబాద్ పగ్గాలు గవర్నర్‌కు ఇవ్వడం సరికాదని ‘తెలుగుపల్స్’ నిర్వహించిన సర్వేలో అత్యధికమంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దాదాపు 73% మంది ఈ అభియ్రాన్ని వ్యక్తం చేశారు. సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడం సమంజసమా? అన్న మొదటి ప్రశ్నకు సర్వేలో మూడు ప్రత్యామ్నాయాలను పొందుపర్చారు. అవి 1) సమంజసమే – హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని కదా 2) ఇది తెలంగాణ ఉనికిని దెబ్బతీసే కుట్ర 3) ఇది రాజకీయ క్రీడ. ఇక రెండవ ప్రశ్న హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధి కారాలు ఇవ్వాలంటూ తెలుగుదేశం ఎందుకు డిమాండ్ చేస్తోంది? అనేదానికి కూడా మూడు ప్రత్యామ్నాయ జవాబులు ఇచ్చారు. అవి 1) ఓటుకు నోటు కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి 2) తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయడానికి 3) సెటిలర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు (6,681 మంది) గవర్నర్‌కు అధికా రాలు అనేది తెలంగాణ ఉనికిని దెబ్బతీసే కుట్ర అని స్పష్టం చేశారు. అదేవిధంగా గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలంటూ తెలుగుదేశం ఎందుకు డిమాండ్ చేస్తోందని అడగ్గా 7,413 మంది ఓటుకు నోటు కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అని తేల్చారు. గవర్నర్‌కు పగ్గాలివ్వడం సమంజ సమేనని 1922 మంది (21 శాతం) అనుకూలత వ్యక్తం చేశారు. కాగా, ఇది రాజకీయ కుట్ర అనే ఆప్షన్‌కు 6 శాతం మంది ఓటు వేశారు.
ఇక రెండవ ప్రశ్న హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలంటే తెలుగుదేశం ఎందుకు డిమాండ్‌చేస్తోందనే ప్రశ్నకు మొదటి ఆప్షన్ ఓటుకు నోటు కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అనే దానికి 81శాతం అవునని తెలిపారు. ఇక రెండవ ఆప్షన్ తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయడానికి అని 641 మంది (07 శాతం) మంది, ఇక మూడో ఆప్షన్ సెటిలర్ల ప్రయోజనాల పరిరక్షణకే అని 1098 మంది 12 శాతం మొగ్గుచూపారు.
గవర్నర్‌కు అధికారాలు, సెక్షన్ 8 అంశాలు చర్చనీయాంశంగా మారిన దశలో ఈ రెండు ప్రశ్నలపై తెలుగుపల్స్ తొమ్మిది రోజుల పాటు సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో నెటిజన్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
ఓ వ్యక్తి గోపాలుడు అందరివాడు… అంటూ గవర్నర్‌గిరి వస్తే దొంగలను పట్టుకోవడం మానేస్తారా? ఏంటి అని అడిగారు. గవర్నర్‌కు అధికారాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద తేడా ఏం ఉండదు అని తేల్చారు.
టిఎస్ వచ్చిన తరువాత ప్రజల మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? సిబిఎన్ (చంద్రబాబు నాయుడు) కొరకు గవర్నర్‌కు పగ్గాలు ఇస్తారా? అని దేవగిరి యుగంధర్ ప్రశ్నించారు.
శాంతిభద్రతలు వంటి కొన్ని అంశాలలో గవర్నర్‌కు బాధ్యతలు ఉండాలని హైదరాబాద్‌కు చెందిన లయన్ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ మీద హక్కు 200 శాతం తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆకుల త్రినాథ్ బాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలు గవర్నర్ పెత్తనానికి సిద్ధంగా లేరని యాదగిరి శ్రీరాములు అన్నారు.
హైదరాబాద్ పగ్గాలు గవర్నర్‌కు ఇవ్వాలనే అంశం పునర్విభజన చట్టంలోనే ఉందని స్పష్టం చేశారు సుజిత్‌కుమార్ గుప్తా.
హైదరాబాద్‌పై అధికారం కేవలం తెలంగాణ ప్రజలదే లేదంటే తప్పదు పోరు అని మహీపాల్ రెడ్డి హెచ్చరించారు.
పది సంవత్సరాల పాటు హైదరాబాద్ పాలన ఉమ్మడిగా ఉండాలి అప్పుడే అన్నీ తేలుతాయి అని క్రాంతి రెడ్డి సూచించారు.
హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితి గురించి సెక్షన్ 8ను ప్రస్తావించారు. దీనిని కాదని ఇతర అంశాలపై ప్రస్తావన తేవడం ఎందుకు? దాని మేరకు గవర్నర్‌కు అధికారాలు ఉండాలి అని రమణమూర్తి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు ఇక పూర్తి స్థాయిలో తన స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకుని ఎంతగా ప్రగతి సాధిస్తారో సాధించుకోవచ్చు కదా….
-ఇప్పటివరకూ ఆ ప్రాంతంలోని వెనుక బడిన ప్రాంతాలను అందరు సిఎంలు నిర్లక్షం చేశారు. ఇకనైనా చంద్రబాబు ఆ పని చేస్తే బాగు అని స్పష్టం చేశారు కాకర్ల జీవరాజు.
హైదరాబాద్‌లో గవర్నర్‌కు పగ్గాలు అవసరం లేదు. హైదరాబాద్‌లో ఎలాంటి సంఘటనలు జరగలేదు. ఏడాది నుంచి అంతా బాగా ఉంది కదా. చాలా ప్రశాంతంగా ఉంది కదా. బాబు అడ్డంగా దొరికాడని ఇలా గవర్నర్‌కు పగ్గాలు అంటున్నారు తప్ప అలాంటి అవసరం ఏదీ లేదని స్పష్టం చేశారు శ్రీనివాస్.
హైదరాబాద్‌లో ఇప్పుడు సామాన్యుడికి ఎలాంటి సమస్య లేదు…టిడిపి కావాలనే రాద్ధాంతం చేస్తోంది- పసులూరి మధుచౌదరి
హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ. హైదరాబాద్ పగ్గాలు గవర్నర్‌కు ఇవ్వడం కుదరదు – మహ్మద్ అబ్దుల్ జబ్బార్
తెలుగుపల్స్ నిర్వహించిన ఈ సర్వేలో 72 శాతం మంది పురుషులు, 28 శాతం మంది స్త్రీలు పాల్గొన్నారు.

Comments