Allu Arjun to donate Rs. 25 lakh for Kerala flood relief

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మానవత్వం చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం (ఆగస్టు-13) ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు బన్నీ. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ ప్రజల నష్టాన్ని పూడ్చలేనిదని.. అయినా తన వంతుగా సాయం అందిస్తున్నట్టు ట్విట్ చేసిన అల్లు అర్జున్.. రూ. 25 లక్షల రూపాయలను కేరణ ప్రజలకోసం విరాళమిస్తున్నట్టు ప్రకటించారు.
కేరళలో సహాయ, పునరావాస కార్యక్రమాల నిమిత్తం సీఎం సహాయనిధిగా విరివిగా విరాళాలివ్వాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ శనివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ముందుగా స్పందించిన హీరో సూర్య, కార్తి 25 లక్షల రూపాయలను ప్రకటించగా, హీరో రాజకీయ నాయకుడు కమల్‌ హాసన్‌ కూడా విరాళం ప్రకటించారు. టాలీవుడ్‌ హీరో అర్జున్‌ రెడ్డి రూ. 5లక్షల రూపాయలను డొనేట్‌ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయిదు రోజులుగా కురిసిన వర్షాలతో అక్కడి ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. గత వందేళ్లలో ఇలాంటి విపత్తు సంభవించ లేదని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించిందంటే అక్కడి పరిస్థితి తీవ్రతను అర‍్థం చేసుకోవచ్చు. కేరళలో మొత్తం 14జిల్లాలకుగానూ 10 జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా, రూ. 8,316 కోట్ల నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వరద సహాయ శిబిరాల్లో 60వేల మంది ప్రజలు తలదాచుకుంటున్నారు. ఆర్మీ, నేవీ, వైమానిక దళం, NDRF టీమ్స్ వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యల‍్ని ముమ్మరంగా అందిస్తున్నాయి. సోమవారం (ఆగస్టు-13) కేరళ వరద ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.

Comments