Party candidates list in September: KCR

వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులను సెప్టెంబర్ లోనే ప్రకటిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. సోమవారం (ఆగస్టు-13) తెలంగాణ భవన్ లో రాష్ట్రకార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడారు సీఎం. ఈ సందర్భంగా 9 కీలక తీర్మాణాలపై చర్చించినట్లు తెలిపారు. విభజనలో ఇచ్చిన హామీలు.. కేంద్రం పరిష్కరించడంపై, కంటివెలుగు, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 25 వేల కోట్లు ఇవ్వాలని తీర్మాణం.. వరి, మొక్కజొన్నకు మద్దతు ధర పెంచాలని కేంద్రానికి ప్రతిపాదన.. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ ఆలస్యం చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చాలన్నారు. బీసీలు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ద్వంద దృష్టి దేశానికి మంచిది కాదని, అన్ని రాష్ట్రాల్లో బీసీల కోసం మంత్రిత్వ శాఖలున్నాయన్నారు. తమిళనాడుకు ఒకనీతి తెలంగాణకు మరోనీతి సరికాదని తెలిపారు. కొన్ని అంశాలను చట్టసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు. న్యూస్ పేపర్ల పాత్ర తగ్గిపోయి వ్యూస్ పాత్ర పెరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో TRS పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. పార్టీ తరుఫున ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ లోనే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. సెప్టెంబర్ 2న ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో భారీ ప్రగతి నివేదన సభ నిర్వహిస్తామని ..ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తానని వెల్లడించారు సీఎం. AICC ప్రెసిడెంట్ రాహుల్ మెచ్యురిటీ పెంచుకుంటే మంచిదని సూచిస్తున్నట్లు తెలిపారు.

రాహుల్ మాటల్లో పరిపక్వత లేదన్నారు. రాహుల్ వస్తే కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపిస్తామని తెలిపారు. 22 లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు కట్టిస్తామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. వేరేవాళ్లు రాసి ఇచ్చినవి మాట్లాడటం సరికాదని ..తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు. రాహుల్ ఇంకా ఎదగాలన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన అంటే మాకేం భయంలేదని..ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. వంద పై చిలుకు సీట్లతో వచ్చే ఎన్నికల్లో TRS గెలుస్తుందని చెప్పారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజీపీ ఫెడరల్ ఫ్రంట్ తోనే ముందుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ సాధ్యం కాదన్నారు. విడతలవారీగా తప్పా..ఒకేసారి దేశంలో ఎక్కడా సాధ్యం కాదన్నారు. తెలంగాణకు ఏడాదికి వచ్చే ఆదాయాన్ని బట్టి రైతులకు రుణమాఫీ చేశామని..ఒకేసారి చేయడం సాధ్యంకాదన్నారు. అనుభవం ప్రకారం చెబుతున్నామని..వచ్చిన ఆదాయాన్ని రుణమాఫీకే కేటాయిస్తే మిగతా పథకాలను ఆపాల్సి వస్తుందన్నారు. ఎన్నికల కోసం ఎడాపెడా హామీలు ఇవ్వడం సరికాదన్నారు సీఎం కేసీఆర్..

Comments