Traditional Birthday Celebration in Karnataka Play School

ప్లే స్కూల్ జమానా ఇది. ఇంట్లోవాళ్లు మరిచిపోయినా.. స్కూళ్లలో టీచర్లే గుర్తుచేసి మరీ బర్త్ డేలు జరుపుతున్న రోజులివి. ఐతే.. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో వెస్ట్రన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. కొవ్వొత్తులు ఊదించడం.. కేక్ కట్ చేయించడం ..ఇంగ్లీష్ లో విష్ చేయడం కామన్ అయిపోయాయి. పుట్టినరోజున కనీసం దేవుడికి దండం పెట్టడం మరిచిపోతున్న ఈ రోజుల్లో ఓ స్కూల్.. పిల్లలకు మన సంప్రదాయాన్ని గుర్తుచేస్తోంది. ఆ స్కూల్ కర్ణాటకలో ఉంది.

కర్ణాటకలో ఓ స్కూల్ లో పిల్లల పుట్టినరోజులు సంప్రదాయపద్ధతిలో జరుపుతున్నారు. పుట్టినరోజు ఉన్న పిల్లలను ఓ కుర్చీలో కూర్చోపెట్టి.. అతడికి మంగళహారతి ఇస్తుంటారు. కొవ్వొత్తులు ఆర్పేసే సంస్కృతి కూడా ఇక్కడ లేదు. చుట్టూ దీపాలు పెట్టి… పిల్లల భవిష్యత్తులో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తుంటారు. హారతి ఇస్తూ జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని.. దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని బొట్టుపెట్టి ఆశీర్వదిస్తుంటారు. అక్షింతలు చల్లుతారు. ఆ తర్వాత పిల్లలు టీచర్ల ఆశీర్వచనాలు తీసుకుంటారు. స్వీట్లు పంచుతారు. అవి కూడా తాము ఇంట్లో చేసుకొచ్చిన పిండి పదార్థాలనే ఇస్తుంటారు. అదీ సంగతి.

చాలాఏళ్ల కిందట.. ఇళ్లలోనూ ఇలాగే పుట్టినరోజులు జరిగేవి. పుట్టినరోజునాడు ఇంట్లోనే కుర్చీపైనా, పీటపైనో కూర్చుండబెట్టి.. ఓ తువాలు కప్పి.. హారతిపళ్లెం ముందు పెట్టి.. బొట్టుపెట్టి అక్షింతలు వేసేవాళ్లు. ఆ తర్వాత.. ఇంట్లోవాళ్లంతా నోరు తీపిచేసుకునేవాళ్లు. పాతకాలం రోజులను మరోసారి ఈ కర్ణాటకలోని స్కూల్ గుర్తుచేసిందని చూసినవాళ్లు అంటున్నారు. ఈ వీడియో వాట్సప్ సహా అన్ని సోషల్ మీడియాల్లో బాగా తిరుగుతోంది.

Comments